మనసు(Conscious Mind), బుద్ధి(Intellect), అహంకారం(I or Ego), చిత్తం(Sub-conscious Mind) - ఈ నాలుగూ మనసులోని విభిన్న స్థితులు. అవి ఏమిటో వాటి పనులేమిటో చూద్దాం!
మనసు అన్నది ఇక్కడ చేతన మనసును (Conscious Mind) సూచిస్తుంది. మనం కన్ను, చెవి, ముక్కు మొదలగు ఇంద్రియాలద్వారా బాహ్య జగత్తును అనుభవించటం ఈ మనసు ద్వారానే జరుగుతుంది. ఇంద్రియాలు పంపే సమాచారాన్ని సేకరించి ఈ మనసే మన సుఖ లేక దుఃఖ అనుభూతులకు హేతువు అవుతుంది.
మనసు యొక్క నిర్ణయాత్మకమైన భాగం బుద్ధి (Intellect) అనబడుతుంది. "ఇటుగా వచ్చేది రాముడేనా లేక భీముడా?" అంటూ తికమక పడేది చేతన మనసు. "ఆ వచ్చేది నిశ్చయంగా రాముడే" అని నిర్ణయించేది లేక ద్రువీకరించేది బుద్ధి.
ఇంద్రియాల ద్వారా మనం అనుక్షణం పొందే అనుభవాలు ప్రతి ఒకటి మన మనసు పొరలలో ఒక్కొక్క విభాగం గా ప్రోగుచేయ బడతాయి. దీనినే చిత్తం లేక సుప్త చేతన మనసు (Sub-conscious Mind) అంటారు. చేతన మనసు ఒక విషయాన్నీ గురించి నిర్ణయించలేక తికమక పడినప్పుడు, చిత్తం లో ఉన్న పాత అనుభవాలను జోడించి బుద్ధి ఒక నిర్ణయానికి వస్తుంది. "ఇతడా లేక అతడా?" అన్న ప్రశ్న తలెత్తినప్పుడు బుద్ది సుప్త చేతన మనసును సలహా అడుగుతుంది. అతనిని ఇంతకు క్రితమే మనం చూసిన అనుభవం ఉంటె, వాటి తాలూకు గుర్తులు అక్కడ వుంటాయి. దానిని బట్టి "ఇది అతడే!" అని బుద్ధి నిర్ణయానికి వస్తుంది.
మనం మెలకువగా ఉన్నప్పుడూ, కల కంటున్నప్పుడూ, ఘాఢ నిద్రపోతున్నప్పుడూ, లేక ఏ స్థితిలో ఉన్నప్పటికీ, 'నేను ఉన్నాను' అన్న స్ఫురణ మనను విడిచిపోదు. అది మన మనసు వెంటే ఎప్పుడూ ఉంటుంది. దీనినే అహం లేక నేను అంటారు. ప్రతి అనుభవానికి ప్రాతిపదిక గా అహం ఉంటుంది. అది లేకుండా మనకు ఏ అనుభవం ఉండదు. కనుక అన్నిటినీ ' నా అనుభవాలు' అంటాము. పదిమంది నిద్రపోతున్నారు అనుకుందాం. వారిలో రాముడనే నేను కూడా ఉన్నాననుకుందాం. ఇంతలో ఎవరో 'రామూ' అని గట్టిగా పిలవగానే, నాకు మెలకువ వచ్చి 'ఓయి' అంటాను. అంటే ఈ 'నేను' అనేది ఎల్లప్పుడూ స్ప్రహ లోనే ఉంటుంది.
****
No comments:
Post a Comment