Sunday, September 17, 2017

కలలూ, కారణాలు, రకాలు !


మనం నిద్రించినపుడు తరుచుగా కలలు రావటం కద్దు. కొన్ని మంచి కలలు గా అనిపించవచ్చు మరి కొన్ని పీడకలలు గా తోచవచ్చు. మరి ఈ కలులు అంటే ఏమిటి, అవి రావటానికి కారణం, వాటిలో రకాలు గురించి మన జ్ఞానులు చెప్పిన విషయాలు తెలుసుకుందాం.

మనం మెలకువ గా ఉన్నప్పుడు చేతన మనసు మాత్రమే పనిచేస్తుందని క్రిందటి బ్లాగ్ లో తెలుసుకున్నాము. ఈ చేతన మనసు (conscious mind) మన మనసులో స్వల్ప భాగమే. ఈ భాగాన్ని పనిచేయించేది మనసులోని అతి పెద్ద భాగమైన సుప్తచేతన మనసు (sub-conscious mind). మనం నిద్రించే సమయంలో చేతన మనసు కూడా విశ్రాంతిలో ఉంటుంది. కానీ సుప్తచేతన మనసు పనిచేస్తుంటుంది. మనకు కలలు రావటానికి కారణం ఈ సుప్త చేతన మనసే. కలలు గురించి విచారణ చేసిన జ్ఞానులు నాలుగు రకాలైన కలలు గురించి వివరించారు.

1. కొనసాగింపు కలలు: 
కొన్ని కలలు జాగ్రదావస్థలో జరిగిన సంఘటనలకు కొనసాగింపుగా ఉండవచ్చు. ప్రతి సంఘటన మనసులో ఒక సంస్కారాన్ని నమోదు చేసి వెళుతుంది. ఆ సంస్కారం సుప్త చేతన మనసు లో పొందు పరచ బడుతుంది. కొన్ని సమయాలలో ఈ సంస్కారాలు పనిచేసి జరిగిన సంఘటనలకు కొనసాగింపుగా కలలు కలుగుతాయి. ఇవి సాధారణమైన కలలు.

2. అణచివేసుకున్న భావాల కలలు:
మన కోరికలు, ఆశయాలు అపరిమితం. వీటిలో కొన్నిటిని మాత్రమే తీర్చుకోగలం, లేక వ్యక్తపరచగలం. మిగతా వాటిని కుటుంభ లేక సామాజిక కారణాలవలనో సుప్త చేతన మనసులో 
అణిచివేసుకుంటాము. ఇవి స్వప్నావస్థలో బయటపడతాయి. ఇవి ప్రత్యక్షంగా రాలేక పరోక్షంగా కలల రూపంలో బయటపడతాయి. వీటిలో అర్థరహితమైన కలలు కూడా ఉంటాయి.  

౩. భవిష్యవాణి కలలు:
సుప్త చేతన మనసు విస్తృతమైనది మరియు శక్తివంతమైనది. కొందరి విషయం లో, కొన్ని సమయాలలో అది భవిష్యత్తును కూడా చూడగలదు. అవి కొందరికి కొన్నిసమయాలలో భవిష్యత్తును సూచిస్తున్న కలలు గా రావచును. 

4. దివ్య స్వప్నాలు: 
అతి కొద్దిమంది జీవితాలలో కలల ద్వారా దైవానుగ్రహం లభించడం కద్దు. దర్శనాలు, దివ్యానుభవాలు వంటివి కలలో కలగడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. పలు సమయాలలో మనం కనే దివ్య స్వప్నాలు కొనసాగింపు కలల కోవకే చెందుతాయి. అనగా మనం చదివిన, విన్న దివ్య అనుభవాల  విషయాలకు ఇవి కొనసాగింపు మాత్రమే. స్వప్నం తరువాత అది మన జీవితంలో కనబరిచే ప్రభావం బట్టి అది దివ్య స్వప్నమా లేక సాధారణ స్వప్నమా అని తెలుసుకోవచ్చు. నిజమైన దివ్య స్వప్నం ఆ వ్యక్తి జీవితం లో గొప్ప మార్పు తెస్తుంది. అతని జీవితం పూర్తిగా భగవన్మయమైన  జీవితం గా మారిపోతుంది.  అలా కాక జీవితం పాత దోరణిలోనే సాగిపోతూ వుంటే అది సాధారణమైన కలగానే భావించవచ్చు. 

***

No comments:

Post a Comment