Wednesday, September 20, 2017

మనిషి - నాలుగు పరిమాణాలు : Four dimensions of man !

మనం క్రిందటి సంచికలో మనిషికి నాలుగు పరిమాణాలు ఉంటాయి అని తెలుసుకున్నాము. అవి జాగ్రద్, స్వప్న, సుషుప్తావస్థలు మరియు ఆత్మ. వాటి గురించి మరి కొంత విపులం గా తెలుసుకుందాము. 

మొదటి పరిమాణం- వైశ్వానరుడు - జాగ్రదావస్థ: 

మనం జాగ్రదావస్థలో ఉన్నప్పుడు  పనిచేస్తూ ఉంటాము, చదువుతుంటాము, ఆడుతూ ఉంటాము, చింతన చేస్తూ ఉంటాము. ఇదంతా చేయుస్తూ, జాగ్రదావస్థలో ఈ జగత్తు ను అనుభవించేవాడు వైశ్వానరుడు. అంటే జగత్తును అనుభవించే స్థితిలో మనం వైశ్వానరుడు అనే పేరు పొందుతాము.   మనం బాహ్య జగత్తును అనుభవించడం మన స్థూల శరీరం తోనే. అందుకే మన స్థూల దేహం బాహ్య జగత్తు యొక్క అంగంగా సూచించబడుతోంది. ఈ జాగ్రదావస్థలో 19 ద్వారాల ద్వారా ఈ బాహ్య ప్రపంచాన్ని అనుభవిస్తున్నాము. అవి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 పంచప్రాణాలు, మనసు, బుద్ధి, అహం, చిత్తం అనే నాలుగు (వీటి గురించి మనం విపులంగా గత సంచికలో చదివాము). ఈ విధంగా జాగ్రదావస్థలో స్థూల ప్రపంచాన్ని అనుభవించే స్థితిలో మనం వైశ్వానరుడు అనబడుతున్నాము. ఇది మన మొదటి పరిమాణం.

రెండవ పరిమాణం - తైజసుడు - స్వప్నావస్థ :

తరువాతది స్వప్నావస్థ. ఇక్కడ బాహ్య జగత్తు లేదు. అనుభవాలన్నీ మానసిక జగత్తు లోనే కలుగుతాయి. శరీరం నిద్రలో విశ్రాంతి తీసుకుంటుంది.  ఆ సమయంలో కూడా మనసు పనిచేస్తూ ఉంటుంది. కానీ మనకు బాహ్య జగత్తు స్ఫురణ ఉండదు. ఎందుకంటే బాహ్య జగత్తును స్ఫురింపజేసే చేతన మనసు  నిద్రలో మునిగి ఉంటుంది. కానీ సుప్త చేతన మనసు మేల్కొనే ఉంటుంది. ఆ మనసు ఒక నూతన లోకాన్ని సృష్టిస్తుంది. అదే కల -స్వప్న లోకం. ఈ స్వప్న లోకం గురించి బృహదారణ్యక  ఉపనిషత్తు ఈ విధంగా వివరిస్తోంది; "అక్కడ రధాలు లేవు, పూన్చడానికి జంతువులు లేవు, బాటలు లేవు, సుఖాలు లేవు, సంతోషం లేదు, ఆనందం లేదు. అక్కడ కాసారాలు లేవు, జలాశయాలు లేవు, నదులు లేవు. అతడు అన్నిటినీ సృజిస్తాడు. ఎందుకంటే అతనే సమస్తాన్ని రూపొందిచేవాడు కనుక"  

శరీరము, చేతన మనసు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సుప్త చేతన మనసు ఇటువంటి పనులు చేస్తుంది. ఒక లోకాన్ని తనకంటూ సృష్టించి సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. స్వప్నలోకాన్ని అనుభవిస్తున్న స్థితిలో మనిషి తైజసుడు అనబడతాడు. 

మూడవ పరిమాణం - ప్రాజ్ఞుడు - సుషుప్తావస్థ :

కోర్కెలో, కలలో- ఏది లేని ఘాడ నిద్రావస్థ మనిషి యొక్క మూడవ పరిమాణం. ఈ స్థితిని అనుభవించేవాడు ప్రాజ్ఞుడు. ఈ స్థితిలో అనుభవాలు ఏవి వుండవు. గ్రహణ శక్తి బహిర్గతమై ఒక రాశి గా ఉంటుంది.  అందువలన ఇది జాగ్రద్, స్వప్న అవస్థలకు ద్వారంగా ఉంటుంది. 'నేను' స్ఫ్రహలో లయించిన మనసు, బయటకు వస్తున్నపుడు మొదటి స్థితిలో కల, ఇంకా బాహ్య స్థితిలోకి వస్తున్నప్పుడు జాగ్రదావస్థ అనుభవిస్తుంది. అందుకే ఇది తక్కిన రెండు స్థితుల ద్వారం అని చెప్పబడింది. ఘాడ నిద్రలో ఉన్న ఒకే అనుభవం సుఖం. అందువల్లనే నిద్రనుండి లేవగానే ' నేను సుఖంగా నిద్రపోయాను' అంటూ మనం చెప్పగలుగుతున్నాము.

బాహ్య జగత్తు యొక్క అనుభవాలు, మానసిక జగత్తు లో పొందే అనుభవాలు కలగలిసినదే మన జీవితం. 'నేను' అన్న స్పురణ ఉన్నప్పుడు మాత్రమే ఈ అనుభవాలను మనం పొందగలం. ఈ 'నేను' స్పురణ లేకపోతే ఏ అనుభవాలు ఉండవు. ఈ స్పురణకు ప్రాతిపదికగా ఉన్నది సుషుప్తావస్థ లోని మూడవ పరిమాణమైన ప్రాజ్ఞుడు. కనుక ప్రతి జీవిలోనూ నేత స్థితిలో ఉన్నవాడు ప్రాజ్ఞుడు.'నేను' లేకుంటే 'నాకు' జగత్తు లేదు. అందుకే ప్రాజ్ఞుడు సమస్తానికి మూల కారణం. 

నాలుగవ పరిమాణం - ఆత్మ: 

నాలుగవ పరిమాణం అని చెప్పబడినప్పటికినీ, ఇది నిజానికి మొదటి మూడు పరిమాణాలు తనలో కలిగి ఉన్నది; కానీ వాటికి అతీతమైన ఒక స్థితి. మన యదార్ధ స్వభావం ఇదే. పై మూడు అవస్థలలోను ఆత్మ ఉనికి ఉన్నది. సూర్యుని సమక్షంలో లోకం నడుస్తోంది. కానీ ఏ కార్యంలోనూ సూర్యుడు ప్రత్యక్షంగా పాల్గొనడు. అలాగే మన సమస్త కార్యకలాపాలు ఆత్మను ప్రాతిపదికగా చేసుకుని జరుగుతాయి. 

ఆత్మ ను గురించి మాండూక్యోపనిషత్తు చక్కగా ఈ విధంగా వివరణ ఇస్తోంది: 

"ఆత్మ అంతర్ముఖ స్థితికాదు, బాహ్య ముఖ స్థితి కాదు. చైతన్యం సమకూరిన స్థితి కాదు; చేతన స్థితి కాదు, అచేతన స్థితి కాదు. అది కనిపించదు. చేతలు లేని, గ్రహించ శక్యం కాని, గుర్తులు లేని, ఊహాతీతమైన, వర్ణనాతీతమైన స్థితి అది. దానిని ఆత్మ చైతన్యం లో మాత్రమే తెలుసుకోగలం. అక్కడ ప్రపంచ చైతన్యం లేదు. అది ప్రశాంతమైనది, మంగళకరమైనది, అద్వయమైనది. ఇదే నాలుగవ పరిమాణం. ఇది ఆత్మ. దీనినే తెలుసుకోవాలి" 

****


                            

No comments:

Post a Comment