మనం సాధారణంగా శివాలయాలు లేక శక్తి ఆలయాలు దర్శించినప్పుడు, శ్రీ చక్ర అర్చన చేయించటం కద్దు. శ్రీ చక్రం అంటే అమ్మవారి ప్రతీక అని మాత్రమే మనలో చాలామందికి సాధారణం గా తోచే విషయం. అ విశ్వాసం మరియు నమ్మకం తో మనం ఆర్చన చేసుకుంటాం.
కానీ లోతుగా పరిశీలించే సాధకులకు, జిజ్ఞాసువులకు శ్రీ చక్ర నిర్మాణం, అందులోని ఆవరణలు, అధిదేవతలు గురించి తెలియటమే కాక అందులోని కేంద్ర బిందుమండల స్థానంలో తేజోమయ రూపంలో విరాజిల్లే అమ్మవారిని ఉపాసిస్తారు.
ఇప్పుడు మనవంటి వారికోసం, నేను చదివిన మరియు విన్న విషయాల ఆధారంగా, ఈ విషయం గురించి మన పరిధిలో ఈ వ్యాస పరంపరలో మీ ముందు ఉంచుతాను. విషయాన్ని అర్థం చేసుకున్న తరువాత మనం చేసే అర్చనలకు మరి కొంత పరిపక్వత వస్తుందని నా అభిప్రాయం.
ముందుగా శ్రీ చక్రం ఎలా ఉంటుందో చూద్దాము;
"బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్ర నాగదళ షోడశ పత్రయుక్తం
వృత్త త్రయంచ ధరణీ సదన త్రయంచ శ్రీ చక్ర రాజ ఉదితః పరదేవతాయాః"
గోపురము వలే కనబడు శ్రీ చక్రము చూడటానికి పైనుండి క్రిందకు క్రమముగా;
1. బిందువు
2. త్రికోణము
3. వసుకోణం
4. అంతర్దశారము
5. బహిర్దశారం
6. చతుర్దశారం
7. అష్టదళపద్మం
8. షోడశదళపద్మం, దాని చుట్టూ మూడు వృత్త రేఖలు
9. మూడు రేఖలతో ధరణీ సదనం (భూపురం)
బిందువు వద్ద పరదేవత అయిన శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారు ఆశీనురాలై ఉంటుంది.
నవావరణములు:
శ్రీ చక్రం లో తొమ్మిది ఆవరణలు ఉంటాయి. వాటినే నవావరణలు అంటారు.
బయటనుండి కేంద్రం వైపు పోయే వరసలో వాటి పేర్లు ఈవిధంగా వుంటాయి.
1. ధరణీ సదనం లేదా భూపురం
2. పదహారు దళ పద్మం
3. నాగ(అష్ట) దళ పద్మం
4. చతుర్దశారం
5. బహిర్దశారం
6. అంతర్దశారము
7. వసుకోణం
8. త్రికోణము
9. బిందువు
వీటి గురించి వివరంగా రాబోయే వ్యాస పరంపర లో తెలుసుకుందాం
***
Thanks for the painstaking effort.
ReplyDelete